
D Spiritual: Nov 19: పాలకుర్తిలో అఖండ జ్యోతి దర్శనానికి ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు ఆలయ ఈఓ ఆహ్వానం!
పాలకుర్తిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్తీక పౌర్ణమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నెల 24న మంగళవారం నిర్వహించనున్న అఖండ జ్యోతి దర్శన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) భాగం లక్ష్మీ ప్రసన్న కోరారు.
ఈ సందర్భంగా గురువారం దేవస్థానం ఆవరణలో అఖండ జ్యోతి ప్రచార రథానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ.. శబరిమలలోని మకరజ్యోతిని తలపించేలా, క్షీరాద్రి శిఖరంగా ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి శ్రీ సోమేశ్వర క్షేత్రంలో దక్షిణ భారతదేశంలోనే మూడో అతిపెద్ద అఖండ జ్యోతి దర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, ఇతర సౌకర్యాల విషయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
అఖండ జ్యోతి వెలిగించేందుకు అవసరమైన నూనె, వత్తులు, కర్పూరాన్ని ప్రతి ఇంటి నుంచి భక్తులు ప్రచార రథానికి అందజేసి ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈఓ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ప్రచార రథాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ భక్తులను అఖండ జ్యోతి దర్శనానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భక్తుల భాగస్వామ్యంతో ఈ వేడుకను మరింత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
సోమేశ్వర స్వామికి వెండి నాగాభరణం సమర్పణ!
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తులు విలువైన కానుకను సమర్పించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిచర్ల చెక్‌పోస్ట్‌కు చెందిన భక్త దంపతులు అనంతోజు రాజు, స్వర్ణలత స్వామివారిపై తమకున్న అపార భక్తితో రూ.1,80,000 విలువైన 1,022 గ్రాముల మిశ్రమ వెండి నాగాభరణాన్ని దేవస్థానానికి అందజేశారు.
ఈ విషయాన్ని ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న వెల్లడించారు. స్వామివారిపై భక్తితో విలువైన వెండి నాగాభరణాన్ని సమర్పించిన దంపతుల ఔదార్యాన్ని ఆలయ వర్గాలు అభినందించాయి. కార్తీక మాసంలో అఖండ జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తూ తమ భక్తిప్రపత్తులను చాటుకోవడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేవగిరి రమేష్, మత్తగజం నాగరాజు, దేవగిరి అనిల్ కుమార్, ఆలయ సిబ్బంది రాములు, రమేష్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
