
D-News: తెలంగాణ రాష్ట్రంలో 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రేషన్ కార్డు కేవలం బియ్యం తీసుకునే పత్రం మాత్రమే కాదని, అది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆకలి తీర్చే భరోసాను రేషన్ కార్డు కల్పిస్తుందని పేర్కొన్నారు.
దేశంలో రేషన్ వ్యవస్థను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
పేదలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు.
