
D NEWS: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి చెందినదిగా పేర్కొంటున్న ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరులోని ఫామ్‌హౌస్ ప్రాంతాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఈ పరిశీలన జరిగింది. ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ బృందంలో పాల్గొన్నారు. ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల వివరాలను పరిశీలించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
అయితే, బీఆర్‌ఎస్ నేతలు భారీగా భూములు, ఫామ్‌హౌస్‌లు సమకూర్చుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల వ్యవహారాల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో జగదీశ్‌రెడ్డి ఆస్తుల విలువ సుమారు రూ.12 లక్షలుగా చూపించారని అన్నారు. ఆ తర్వాత ఆస్తులు భారీగా పెరిగాయని ఆరోపించారు. ఈ పెరుగుదలపై ప్రజలకు వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇక బీఆర్‌ఎస్‌కు చెందిన ఇతర నేతల ఫామ్‌హౌస్‌లను కూడా పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, పైలట్ రోహిత్‌రెడ్డికి సంబంధించిన భూములు, ఆస్తుల అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, భూములపై చేసిన ఆరోపణలపై సంబంధిత నేతల వివరణ కూడా అవసరమని పేర్కొనడం గమనార్హం.
