
తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా సోమవారం శాసనసభలో పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు.
‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించనున్నట్లు సీఎం విజయ్ తెలిపారు. ఈ పథకాన్ని వచ్చే ఏడాది పొంగల్ నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. సిలిండర్లకు సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుందని రాష్ట్ర ఖజానాపై ఏటా దాదాపు రూ.4,000 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. మహిళలు, ట్రాన్స్జెండర్లకు, ఉచిత బస్సు ప్రయాణాన్ని విస్తరించేందుకు ‘వెట్రి పయన తిట్టం’ పథకాన్ని కూడా సీఎం ప్రకటించారు.
ఇకపై ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్ స్టాప్, డీలక్స్ సర్వీసుల్లోనూ మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఉచిత ప్రయాణానికి ఆదాయ పరిమితి లేదా ప్రయాణాల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. ఈ విస్తరించిన పథకం అక్టోబర్ 2, గాంధీ జయంతి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఇదిలా ఉండగా చెన్నై శివార్లలోని పరందూర్‌లో ప్రతిపాదించిన రెండో విమానాశ్రయ ప్రాజెక్టుపై కూడా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. పరందూర్ విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనను తమ ప్రభుత్వం విరమించుకుంటున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలకు తన మద్దతు ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పోరాడుతున్న నిరసనకారులకు అండగా ఉంటానని ఆయన ప్రకటించారు.
