
ఇండోర్లో ఇటీవల జరిగిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ మిమిక్రీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన చర్యలను సమర్థిస్తున్నారు.
ముంబైలో ఆదివారం మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీకి రాజకీయాల్లో మిగిలిన ఏకైక పని మిమిక్రీ చేయడమేనని వ్యాఖ్యానించారు. ఆయన స్టాండ్-అప్ కమెడియన్గా మారితే మంచి ఉపాధి లభిస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ఆయన నిరుద్యోగంగా మార్చేశారని విమర్శించారు.
బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సారావోగి సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన మాటలు చేష్టలు రాజకీయంగా అపరిపక్వతను హుందాతనం లేని ప్రవర్తనను ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. లోక్సభ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి ప్రధాని మాతృమూర్తిని అవమానించేలా వ్యవహరించడం సమాజం అంగీకరించదని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. అది కేవలం సాధారణ మిమిక్రీ మాత్రమేనని అందులో అభ్యంతరకరమైన అంశమేమీ లేదని అన్నారు. కార్యక్రమంలో సభికులు, మహిళలు నవ్వుకున్నారని పేర్కొన్నారు. గతంలో ప్రధాని మోదీ సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలే నిజమైన అవమానకరమైనవని ఆయన ఆరోపించారు.
కమెడియన్ పుల్కిత్ మణితో కలిసి ఇండోర్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చేష్టలు ప్రధాని మోదీతో పాటు ఆయన తల్లిని ఉద్దేశించి గేలి చేసేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. దీంతో రాహుల్ గాంధీ మిమిక్రీపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
