కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. పేదల కోసం ఎంతైనా ఖర్చు చేయాలనే ఉద్దేశం తమకు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు. బీసీల రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. చేనేత కళ దేశం గర్వించదగిన కళ అని, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి కళలకు పుట్టినిల్లుగా నిలుస్తోందని అన్నారు. మన చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత సన్నని చీరలను కూడా తయారు చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “చీరాలకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చేనేత కుటుంబాలతో కలిసి జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించాం. అర్హత ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకోసం రూ.179 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం.

చేనేత కార్మికులంటే నాకు మొదటి నుంచీ ప్రత్యేక అభిమానం ఉంది. వారి సమస్యలు, కష్టాలు నాకు బాగా తెలుసు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చేనేత రంగం కోసం పోరాడాం. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం. దేశం గర్వించే కళ చేనేత. చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి పట్టు, కాటన్ చీరలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో చీరాల కర్చీఫ్‌లు విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేవి” అని చంద్రబాబు తెలిపారు.

చేనేత రంగం కాలక్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని సీఎం అన్నారు. చేనేతను మరింత ప్రోత్సహించి, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, శ్రీకాకుళం, మంగళగిరి, పొందూరు, పెడన, నరసాపురం ప్రాంతాల చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు.

చేనేత రంగం పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 1,27,000 మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. “నేను ఎన్నో వృత్తులను చూశాను. కానీ చేనేత వృత్తిపైనే పూర్తిగా ఆధారపడే వర్గం చేనేత కార్మికులది. మగ్గాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఏకైక వర్గం వీరే. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను.

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో హ్యాండ్లూమ్‌కు రూ.200, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని అమలు చేశాం. చేనేత కార్మికులు అనారోగ్య సమస్యలకు గురవుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 50 ఏళ్లకే పెన్షన్ అందించేలా నిర్ణయం తీసుకున్నాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.