
D NEWS: వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందడం లేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా శివంపేట మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. చండి విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.
సకాలంలో విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి పంటకు కీలక దశలో నీరు అందకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు. బోర్ల ద్వారా పొలాలకు నీరు అందించలేకపోతున్నామని తెలిపారు.
అలాగే, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం ఇప్పటికే పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు విద్యుత్ సమస్య వల్ల పంటలు దెబ్బతింటే పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
మరోవైపు, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలకు నష్టం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తొలగించి రైతులకు సకాలంలో కరెంటు అందించాలని అన్నారు.
ధర్నా నేపథ్యంలో శివంపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడిన అనంతరం ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజా రమణ గౌడ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ దొంతి చంద్ర గౌడ్, పార్టీ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
