
D News: Sept 5: పోస్టల్ శాఖలో 23,757 జీడీఎస్ పోస్టులు.. పదో తరగతి అర్హతతోనే అవకాశం
భారత తపాలా శాఖ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులు పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్‌తో పాటు సంబంధిత స్థానిక భాషను చదివి ఉండాలి. తెలుగు రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకునే వారు స్థానిక భాషగా తెలుగు చదివి ఉండాలి. అలాగే కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండటం కూడా అవసరం.
అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.29,380 వరకు వేతనం అందుతుంది.
ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏమిటంటే.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పదో తరగతిలో అభ్యర్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీంతో పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 19తో ముగియనుండగా, దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకునేందుకు సెప్టెంబరు 23, 24 తేదీల్లో అవకాశం కల్పించారు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్-ఉమెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలని తపాలా శాఖ స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ సర్కిళ్లకు దరఖాస్తు చేస్తే అభ్యర్థుల దరఖాస్తులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
