మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం మంజీరా చెక్‌డ్యాం వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ కాంగ్రెస్‌ కండువా కప్పుకోలేదని మూడు రంగుల జాతీయ కండువానే కప్పుకున్నానని స్పష్టం చేశారు. మంత్రి పదవి కోసమో డబ్బు కోసమో తాను పార్టీ మారలేదన్నారు.

రెండేళ్ల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చి సీఎం రేవంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారని పోచారం తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా తన ఇంటికి వచ్చి ఆరు నెలల్లో నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

అయితే సీఎం ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చెప్పినా మంత్రులు తన ఫోన్‌ ఎత్తడం లేదని, చివరకు మంత్రులు సీఎం మాటను కూడా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

బిల్లులు చెల్లింపులు కాకపోవడంతో నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేశారని పోచారం తెలిపారు. దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

By Rajini