
D NEWS: బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి తరలించారు.

బీఆర్‌ఎస్ నాయకుల ఆరోపణల ప్రకారం, గత ప్రభుత్వ హయాంలో పండుగల ఏర్పాట్లను ముందుగానే చేపట్టేవారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం, నగరపాలక సంస్థ ఏర్పాట్లలో జాప్యం చేస్తున్నాయని వారు విమర్శించారు.
మరోవైపు, నగరంలో పనిచేయని వీధి దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే మహిళలు చీకట్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని మూడు రోజుల్లోగా పండుగ ఏర్పాట్లు పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. ఈ నిరసనలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
