
D Spiritual: Jul 8: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సైన్స్ గ్రూపుల ప్రాక్టికల్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలను ఇకపై ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు విడివిడిగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది.
నూతన విధానం ప్రకారం, రెండు సంవత్సరాల్లోనూ బోర్డు నియమించే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థుల మూల్యాంకనంలో పారదర్శకత, ఏకరూపత పెరుగుతుందని బోర్డు భావిస్తోంది.
సైన్స్ సబ్జెక్టుల థియరీ పరీక్షలు యథాతథంగా 60 మార్కులకే కొనసాగనున్నాయి. అయితే ప్రాక్టికల్ పరీక్షల విధానాన్ని పునర్వ్యవస్థీకరించి, ప్రథమ సంవత్సరానికి 15 మార్కులు, ద్వితీయ సంవత్సరానికి 15 మార్కులు కేటాయించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షను గంటా 30 నిమిషాల వ్యవధిలో నిర్వహించనున్నారు.
ప్రాక్టికల్ సిలబస్, మోడల్ ప్రశ్నాపత్రాలు, నెలవారీ షెడ్యూల్‌తో కూడిన ల్యాబ్ మాన్యువల్స్‌ను బోర్డు ఇప్పటికే తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. వీటి ఆధారంగా కళాశాలలు విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించాలని సూచించింది.
కొత్త విధానాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా అమలు చేయాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. వార్షిక అకాడమిక్ ప్లాన్ ప్రకారం క్రమం తప్పకుండా ప్రాక్టికల్ తరగతులు నిర్వహించి, పరీక్షల నాటికి విద్యార్థులు అన్ని ప్రయోగాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.
ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ల్యాబ్‌లలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ప్రాక్టికల్ మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
