
D Spiritual: Aug 22: గుడిలో ఫొటోలు, రీల్స్ చేస్తున్నారా? ఇకపై జాగ్రత్త.. నిబంధనలు కఠినం
మీరు గుడికి వెళ్లినప్పుడు ఫొటోలు తీస్తున్నారా? గర్భగుడి వద్ద రీల్స్ చేస్తున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహాల ఫొటోలు, వీడియోలు తీయడంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆలయాల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటంతో పాటు ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహాలను ఫొటోలు తీయడం, వీడియోలు చేయడం, రీల్స్ రూపొందించడంపై పూర్తి స్థాయి నిషేధం విధించారు. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని, భక్తులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
గర్భాలయంలోని మూలవిరాట్ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ, యంత్ర స్థాపన వంటి ఆధ్యాత్మిక ప్రక్రియలు జరిగి ఉంటాయని పండితులు చెబుతున్నారు. కెమెరా ఫ్లాష్‌లు, డిజిటల్ చిత్రీకరణలు ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. దర్శన సమయంలో కొందరు భక్తులు ఫొటోలు తీసి రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వల్ల ఇతర భక్తుల ఏకాగ్రతకు, ఆలయ ప్రశాంత వాతావరణానికి ఇబ్బంది కలుగుతోందని అధికారులు తెలిపారు.
అలాగే ప్రాచీన, చారిత్రక విగ్రహాల వివరాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ప్రచారం కావడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ కారణాలతోనే గర్భగుడిలో ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణపై నిషేధం విధించినట్లు వెల్లడించారు.
అన్ని కేటగిరీల ఆలయాలకు నిబంధనలు
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 6(A), 6(B), 6(C) కేటగిరీలకు చెందిన చిన్న, పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిషేధం కేవలం ఆలయంలోని మూలవిరాట్ విగ్రహాలకే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ఆలయ ప్రాంగణంలో, కల్యాణోత్సవాలు, రథోత్సవాలు వంటి కార్యక్రమాల్లో ప్రదర్శించే ఉత్సవ మూర్తుల ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. భక్తులకు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఆలయ ప్రవేశ ద్వారాలు, క్యూలైన్లు, గర్భగుడి ముఖద్వారం వద్ద ‘ఫొటోగ్రఫీ నిషేధం’ అనే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
గర్భగుడిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్యంగా ఫొటోలు లేదా వీడియోలు తీస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి. హరి సూర్య ప్రకాష్ హెచ్చరించారు. నిబంధనలు అమలయ్యేలా ఆలయ సిబ్బంది, అర్చకులు కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు.
భక్తులు మొబైల్ ఫోన్ వినియోగంపై నియంత్రణ పాటిస్తూ ఆలయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక నియమాలను గౌరవించాలని అధికారులు సూచించారు. దైవ దర్శన సమయంలో ఫొటోలు, రీల్స్ కంటే భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
