
D News : మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తన తొలి వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరుసటి రోజే యువ దర్శకుడు బెల్రాజ్ కలరిక్కల్ కన్నుమూశారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొచ్చిలోని ఓ హోటల్ గదిలో ఆయన మృతదేహం కనిపించినట్లు సమాచారం. గుండెపోటుతోనే బెల్రాజ్ మరణించినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
వెబ్‌సిరీస్ విడుదలైన మరుసటి రోజే విషాదం
బెల్రాజ్ దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్ ‘కప్పి స్క్వాడ్’ శుక్రవారం జియో హాట్‌స్టార్‌లో విడుదలైంది. దర్శకుడిగా తన ప్రయాణంలో కీలకమైన ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మరణవార్త వెలువడటం విషాదాన్ని మరింత పెంచింది.
వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన బెల్రాజ్.. ఆరేళ్లుగా ప్రేమించిన యువతిని గత సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. కెరీర్లో ఎదుగుతున్న సమయంలో, కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది రోజులకే ఆయన దూరమవడం మలయాళ సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.
సహాయ దర్శకుడి నుంచి దర్శకుడిగా..
బెల్రాజ్ గతంలో ‘నిజల్’, ‘మధురం’, ‘డాకిని’ వంటి మలయాళ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ‘కప్పి స్క్వాడ్’తో పూర్తిస్థాయి దర్శకుడిగా పరిచయమయ్యారు. రినోష్ జార్జ్, అనఘ అజిత్, దియా దీపన్, జోయెల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్.. నలుగురు యువకులు తమ స్టార్టప్ కలలను నిజం చేసుకునేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ సాగుతుంది. శ్రీకాంత్ మోహన్ రూపొందించిన ఈ సిరీస్‌ను నిర్మాత రాహుల్ రిజి నాయర్ నిర్మించారు.
తొలి వెబ్‌సిరీస్‌తోనే దర్శకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించిన బెల్రాజ్.. ఇలా అకాల మరణం చెందడం సినీ వర్గాలను కలచివేస్తోంది.
