
D Spiritual: Nov 23: బుగ్గ దేవస్థానంలో కార్తీక సోమవారం.. పోటెత్తిన భక్తులు
బెల్లంపల్లి మండలంలోని ప్రసిద్ధ బుగ్గ దేవస్థానానికి కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తుల తాకిడి భారీగా పెరిగింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.
అర్చకులు కూరెళ్లి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి గర్భగుడిలో కొలువైన రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
శివలింగానికి మహా అన్నపూజ
అశేష భక్తుల సమక్షంలో గర్భగుడిలోని శివలింగానికి మహా అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుడు సిద్ధం పోశం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ప్రసాదం అందజేశారు. అలాగే నాయకుడు దూడం మహేష్ ఆధ్వర్యంలో పుల్ల సరిత, లక్ష్మీనారాయణ గౌడ్ దంపతులు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
నేడు కార్తీక దీపోత్సవం, జ్వాలాతోరణం
కార్తీక మాసం సందర్భంగా మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బుగ్గ దేవస్థానం వద్ద కార్తీక దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.
