
D Sports: Aug 10: ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ బసంత్ కుమార్ అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. పురుషుల హైజంప్ విభాగంలో 2.21 మీటర్ల ఎత్తును విజయవంతంగా అధిగమించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై హైజంప్ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా బసంత్ కుమార్ అరుదైన ఘనతను అందుకున్నారు.
హైజంప్ పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. 19 ఏళ్ల బసంత్ కుమార్‌తో పాటు అల్జీరియాకు చెందిన యూనెస్ అయాచి, బ్రిటన్‌కు చెందిన ఓటిస్ పూల్ కూడా 2.21 మీటర్ల ఎత్తును సమంగా క్లియర్ చేశారు. అనంతరం 2.24 మీటర్ల ఎత్తును అధిగమించేందుకు ముగ్గురు అథ్లెట్లు ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేకపోయారు. దీంతో విజేతలను నిర్ణయించేందుకు నిర్వాహకులు ‘కౌంట్‌బ్యాక్’ నిబంధనను అమలు చేశారు.
కౌంట్‌బ్యాక్‌లో భాగంగా తక్కువ ప్రయత్నాల్లో 2.21 మీటర్ల ఎత్తును అధిగమించిన అల్జీరియా అథ్లెట్ యూనెస్ అయాచికి స్వర్ణ పతకం దక్కింది. బసంత్ కుమార్ రజత పతకంతో సరిపెట్టుకోగా, బ్రిటన్‌కు చెందిన ఓటిస్ పూల్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఫలితంతో ప్రపంచ అండర్-20 హైజంప్ విభాగంలో భారత్‌కు తొలిసారి పతకం లభించింది.
జాతీయ రికార్డు హోల్డర్ సహానా కుమారి పర్యవేక్షణలో బసంత్ కుమార్ కఠిన శిక్షణ పొందుతున్నారు. గతంలో ఆయన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 2.11 మీటర్లు కాగా, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 10 సెంటీమీటర్ల మేర తన వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకున్నారు. 2.21 మీటర్ల ఎత్తును అధిగమించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటడంతో పాటు భారత అథ్లెటిక్స్‌లో కొత్త ఆశలు రేకెత్తించారు.
