
D Entr: Aug 10: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ముందస్తు వివాహ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో బండ్ల గణేష్ తన కుమార్తె జననితో కలిసి వేదికపై ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. కుమార్తెపై ఉన్న ప్రేమను చాటుతూ ఆయన చేసిన సందడి, వేసిన స్టెప్పులు అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సంగీత్ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. నూతన వధూవరులను, బండ్ల గణేష్ కుటుంబ సభ్యులను వారు ఆశీర్వదించారు. చిరంజీవి వేడుకకు హాజరు కావడంతో కార్యక్రమంలో సందడి మరింత పెరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సంగీత్ కార్యక్రమంలో బండ్ల గణేష్ తన కుమార్తె జననిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, బుగ్గపై ముద్దు పెట్టుకున్న దృశ్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కుమార్తెపై తనకున్న ప్రేమను చాటుతూ ఆయన వ్యవహరించిన తీరు పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బండ్ల గణేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కుమార్తె పట్ల తండ్రిగా ఆయన చూపించిన ఆప్యాయత, ప్రేమ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సంగీత్ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుండగా.. అభిమానులు బండ్ల గణేష్‌ను ‘ది గ్రేట్ ఫాదర్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
