
D Educt: Aug 25: ఆధునిక విద్యా బోధనలో పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం అవసరమని అత్యధిక మంది ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. అయితే ఏఐను ఎంతవరకు, ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై స్పష్టమైన పరిధిని నిర్ణయించాల్సిన అవసరం ఉందని వారు తేల్చిచెప్పారు.
క్యూఎస్ ఐ-గేజ్ తాజా నివేదిక ప్రకారం.. 91 శాతం మంది ఉపాధ్యాయులు విద్యా రంగంలో ఏఐ ప్రాధాన్యాన్ని గుర్తించారు. అయితే దేశవ్యాప్తంగా కేవలం 13 శాతం పాఠశాలలు మాత్రమే ఏఐ వినియోగానికి అవసరమైన సంస్థాగత సన్నద్ధతను కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు, ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ వినియోగానికి ప్రతి ఐదుగురు బోధనా సిబ్బందిలో నలుగురు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది.
అతిగా ఏఐపై ఆధారపడితే నష్టమే..
విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఏఐ ఉపయోగపడుతున్నప్పటికీ, దానిపై అతిగా ఆధారపడటం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్యార్థుల స్వతంత్ర ఆలోచనా శక్తి, సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని 78 శాతం మంది అధ్యాపకులు పేర్కొన్నారు.
భవిష్యత్తు అవసరాలకు ఏఐ కీలకం
విద్యార్థులను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఏఐ వినియోగం అవసరమేనని 88 శాతం మంది ఉపాధ్యాయులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు చిన్న వయసు నుంచే ఏఐపై అవగాహన కల్పించడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
21 రాష్ట్రాల్లో అధ్యయనం
క్యూఎస్ ఐ-గేజ్ ఈ నివేదికను 21 రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనం ఆధారంగా రూపొందించింది. 12వ తరగతి వరకు బోధించే 72 పాఠశాలలకు చెందిన 1,209 మంది ఉపాధ్యాయులు, 146 ఉన్నత విద్యా సంస్థల్లోని 1,118 మంది అధ్యాపకుల అభిప్రాయాలను సేకరించినట్లు సంస్థ తెలిపింది.
ఏఐ సాంకేతికతను సమర్థంగా అందిపుచ్చుకునేందుకు అవసరమైన సంస్థాగత మార్పుల విషయంలో విద్యాసంస్థల సన్నద్ధతలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఏఐ వినియోగంపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు సానుకూలంగా ఉన్నప్పటికీ.. మౌలిక సదుపాయాలు, శిక్షణ, విధానపరమైన మార్గదర్శకాలు వంటి అంశాల్లో విద్యాసంస్థలు మరింతగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
