
D Spiritual: Nov 23: శ్రీవారికి రూ.160 కోట్ల విలువైన బంగారు కానుక.. 121 కిలోల బంగారంతో 45 రకాల ఆభరణాల తయారీ!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు భారీ బంగారు కానుక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. స్వామివారిపై తనకున్న అపార భక్తిని చాటుకుంటూ ఏకంగా 121 కిలోల బంగారంతో ప్రత్యేక ఆభరణాలను తయారు చేయించారు. ఈ ఆభరణాల విలువ సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మొత్తం 9 సెట్లుగా 45 రకాల బంగారు ఆభరణాలను రూపొందించినట్లు సమాచారం. వీటిని శ్రీవారి సేవకు సమర్పించేందుకు భక్తుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో టీటీడీ అధికారులకు ఈ ఆభరణాలను అధికారికంగా అందజేయనున్నారు.
టీటీడీ అధికారులతో సంప్రదింపులు
ఈ భారీ బంగారు కానుక సమర్పణకు సంబంధించి ఇప్పటికే సదరు భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆభరణాలను స్వామివారికి సమర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.
121 కిలోల బంగారంతో తయారైన 45 రకాల ఆభరణాలు 9 సెట్లుగా శ్రీవారికి అందనుండటంతో ఈ కానుకకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. స్వామివారిపై భక్తుడికి ఉన్న అపారమైన భక్తి, శ్రీవారి సేవ పట్ల ఆయనకున్న అంకితభావానికి ఈ కానుక నిదర్శనంగా నిలవనుంది.
