
D Spiritual: Oct 7: టీటీడీ: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది.
టీటీడీ విడుదల చేయనున్న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిర్దిష్ట తేదీలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 12, 13, 14 తేదీలతో పాటు 18, 19, 20 తేదీలకు సంబంధించిన దర్శన కోటాను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. రద్దీని నియంత్రించడం, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం కోసం ఈ విధంగా టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
ఇదిలా ఉండగా, తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ప్రివిలేజ్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, బ్రహ్మోత్సవాల సమయంలో దర్శన ఏర్పాట్లను సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
