
DSports 6Dec:ముంబై: భారత స్టార్ మహిళా క్రికెటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన పెళ్లి వాయిదా పడిన దాదాపు రెండు వారాల తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్తో ఆమె వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, తండ్రి శ్రీనివాస్ మంధాన ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
మంధాన తొలి పోస్ట్
పెళ్లి వాయిదా తర్వాత మంధాన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన తొలి పోస్ట్.. ఒక ప్రముఖ టూత్‌పేస్ట్ బ్రాండ్‌కు సంబంధించిన ప్రకటన (Paid Partnership) వీడియో. ఈ వీడియోలో ఆమె తన క్రికెట్ ప్రయాణం గురించి, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ నుండి పొందిన సలహా గురించి మాట్లాడింది.
అనుమానాలు పెంచిన ‘ఉంగరం’ మాయం
అయితే, ఈ ప్రకటన వీడియో చూసిన అభిమానుల దృష్టి మొత్తం మంధాన చేతిపై ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్ మీదనే పడింది. ఆ వీడియోలో ఆమె చేతికి ఉంగరం కనిపించకపోవడంతో నెటిజన్లలో అనేక చర్చలు మొదలయ్యాయి.”ఉంగరం ఎక్కడికి పోయింది?” అని కొందరు ప్రశ్నించగా, మరికొందరు, “ఈ ప్రకటన నిశ్చితార్థానికి ముందే చిత్రీకరించబడి ఉండవచ్చు” అని అభిప్రాయపడ్డారు. పెళ్లి వాయిదా పడిన వెంటనే మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి, నిశ్చితార్థానికి సంబంధించిన పాత పోస్టులన్నింటినీ తొలగించడం, ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాకు రావడం, ఇప్పుడు చేతికి ఉంగరం లేకపోవడం వంటి పరిణామాలు అభిమానుల్లో అనుమానాలను మరింత పెంచాయి.
