D NEWS: తెలంగాణ అస్తిత్వంపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే అమరవీరుల త్యాగమే తప్ప కేసీఆర్ కాదని ఆయన అన్నారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తూ పలు ఆరోపణలు చేశారు.

కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారనడం అబద్ధమని అద్దంకి దయాకర్ అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కేసీఆర్ ఎక్కడ తల పెట్టినా రాష్ట్రం వచ్చేది కాదని విమర్శించారు. తెలంగాణ అంటే తామేనని భావించిన కల్వకుంట్ల కుటుంబ రాజకీయ ఆధిపత్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీశారని అన్నారు.

సెప్టెంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో పర్యటించనున్నారని అద్దంకి దయాకర్ తెలిపారు. కేసీఆర్ తన బంధువులు, అనుచరులతో నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

కేటీఆర్‌పై కూడా అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తానని చెప్పడం ద్వారా కేటీఆర్ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ తమను బెదిరించే ముందు తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్ నేతలు అసైన్డ్ భూములు, ఇనాం భూములు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. గతంలో దళితులకు ఇచ్చిన భూములను కూడా బీఆర్‌ఎస్ నేతలు లాక్కున్నారని విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన భూములను హైడ్రా ఆక్రమణల నుంచి విముక్తి చేసిందని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న తెలంగాణ ద్రోహులను కేసీఆర్ తన వెంట పెట్టుకుని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.