D News: Oct 16: దసరా సెలవుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆధార్‌ నమోదు క్యాంపులను నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఆయా మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అక్టోబరు 15న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్‌ కార్డు లేని పిల్లలు, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.

ఆధార్‌కు సంబంధించిన ఇతర సేవలు అవసరమైన ప్రజలు కూడా ఈ క్యాంపులకు హాజరుకావచ్చని నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు. ఆధార్‌ నమోదు, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ సేవలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. దసరా సెలవులను సద్వినియోగం చేసుకుంటూ అర్హులైన విద్యార్థులు ఆధార్‌ సంబంధిత సేవలను పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు, పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా ప్రాజెక్టుకు ఐఎస్‌ఓ 9001:2015 ధ్రువీకరణ లభించినట్లు నవీన్‌ నికోలస్‌ మరో ప్రకటనలో తెలిపారు. నాణ్యమైన పరిపాలన, పారదర్శక ఆర్థిక నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సమగ్ర శిక్షా ప్రాజెక్టు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ ధ్రువీకరణ లభించిందని పేర్కొన్నారు. విద్యా రంగంలో మెరుగైన సేవలు అందించేందుకు, పరిపాలనా విధానాల్లో నాణ్యతను పెంపొందించేందుకు సమగ్ర శిక్షా ప్రాజెక్టు చేపడుతున్న చర్యలకు ఈ గుర్తింపు దోహదపడుతుందని తెలిపారు.