D Educt: Aug 25: ఇప్పటితరం విద్యార్థులు తమ భవిష్యత్తు విషయంలో చిన్న వయసు నుంచే స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. తల్లిదండ్రులు సూచించిన మార్గాన్ని అనుసరించడం కంటే.. తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని, అందుకు అనుగుణంగా ప్రణాళికతో కష్టపడుతున్నారు. అనీశ్‌ ఫాతిమా కూడా అలాంటి విద్యార్థినే. తొమ్మిదో తరగతి నుంచే విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదవాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, దానికి అనుగుణంగా తన ప్రొఫైల్‌ను తీర్చిదిద్దుకుంది. తాజాగా రీచ్‌ ఆక్స్‌ఫర్డ్‌ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకుని అరుదైన అవకాశాన్ని అందుకుంది.

చదువుతో పాటు పెద్ద కలలు

కేంద్రియ విద్యాలయాలు చదువుతో పాటు పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు అవసరమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని నేర్పిస్తాయని అనీశ్‌ ఫాతిమా తెలిపింది. తన విషయంలోనూ అదే జరిగిందని చెప్పింది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన తన తండ్రి జాకీర్‌ హుస్సేన్‌ విద్యాశాఖలో క్లరికల్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తల్లి షానవాజ్‌ బేగం ఉపాధ్యాయురాలు. అన్నయ్య బీటెక్‌ చదువుతున్నాడు. మధ్యతరగతి కుటుంబమైనప్పటికీ చదువే తమ జీవితాలను మార్చగలదని తల్లిదండ్రులు, అమ్మమ్మ రషీద్‌ కౌతమ్‌ చిన్నప్పటి నుంచే చెప్పేవారని ఫాతిమా గుర్తుచేసుకుంది.

చిన్నప్పటి నుంచే పోటీల్లో చురుగ్గా..

చిన్నప్పటి నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఫాతిమా గుంతకల్లులోని కేంద్రియ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తిచేసుకుంది. సైన్స్‌, మ్యాథ్స్‌లో జరిగే వివిధ పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. ఇంటర్నేషనల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ ఒలింపియాడ్స్‌లో పతకాలు సాధించింది. ఈ పోటీల్లో పాల్గొనడం వల్ల ఆయా సబ్జెక్టులపై తనకు మరింత ఆసక్తి పెరిగిందని తెలిపింది. సామాజిక సేవపై కూడా ఆసక్తి ఉండటంతో స్కౌట్స్‌లో చురుగ్గా పాల్గొంది. అందుకు గుర్తింపుగా రాజ్య పురస్కార్‌ను కూడా అందుకుంది.

తొమ్మిదో తరగతి నుంచే లక్ష్యం

ఓ రోజు తన టీచర్‌ ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో చదవడం ప్రతి విద్యార్థి కలగా ఉండాలని చెప్పారని ఫాతిమా తెలిపింది. ఆ మాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయని, అప్పటి నుంచే విదేశీ యూనివర్సిటీలో చదవాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నానని చెప్పింది. తొమ్మిదో తరగతి నుంచే అందుకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభించింది.

కంప్యూటర్‌ సైన్స్‌పై ఆసక్తితో సి ప్లస్‌ ప్లస్‌, జావా, పైథాన్‌ వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలను నేర్చుకోవడం ప్రారంభించింది. అనంతరం గుత్తిలోని కేంద్రియ విద్యాలయంలో ఎమ్‌బైపీసీ గ్రూప్‌లో ఇంటర్‌ సీటు సాధించింది.

బలమైన ప్రొఫైల్‌ కోసం కృషి

విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలంటే ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఫాతిమా భావించింది. అందుకే చిన్న వయసు నుంచే తన ప్రొఫైల్‌ను బలంగా తయారుచేసుకునేందుకు ప్రయత్నించింది. ఒకవైపు కంప్యూటర్‌ లాంగ్వేజీల్లో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు చేస్తూనే, మరోవైపు వివిధ పోటీలు, ప్రాజెక్టుల కోసం అన్వేషించేది.

ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్‌ నిర్వహించే అకడమిక్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇంటర్న్‌ ప్రాజెక్ట్‌ గురించి తెలుసుకుంది. ఇందులో అర్హత సాధించేందుకు కంప్యూటర్‌ సైన్స్‌లో కీలకమైన అల్గారిథమ్స్‌ను ఉపయోగించే కోడింగ్‌ సమస్యలను పరిష్కరించేలా చిన్న చిన్న సాఫ్ట్‌వేర్‌ మోడల్స్‌ను అభివృద్ధి చేసింది.

123 దేశాల విద్యార్థులతో పోటీ

ఈ పోటీలో 123 దేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారితో పోటీ పడి అర్హత సాధించిన ఫాతిమాకు ఆక్స్‌ఫర్డ్‌లో ఇంటర్న్‌గా శిక్షణ పొందే అవకాశం లభించింది. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి ఇంటర్‌ పరీక్షలు రాసింది. ఆ తర్వాత ‘మ్యాట్‌’ పరీక్షకు సిద్ధమై 98 శాతం మార్కులు సాధించి ఆక్స్‌ఫర్డ్‌లో సీటు పొందింది.

నాలుగు ప్రముఖ యూనివర్సిటీల నుంచి ఆఫర్లు

ఆక్స్‌ఫర్డ్‌లో ప్రవేశానికి పోటీ ఎక్కువగా ఉండటంతో ముందుజాగ్రత్తగా బ్యాక్‌అప్‌ ప్లాన్‌ను కూడా సిద్ధం చేసుకుంది. ఇంగ్లండ్‌లోని డర్హమ్‌, బ్రిస్టల్‌ యూనివర్సిటీలతో పాటు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకీ దరఖాస్తు చేసింది. నాలుగు విశ్వవిద్యాలయాల నుంచి ఆఫర్‌ లెటర్లు వచ్చినప్పటికీ ఆక్స్‌ఫర్డ్‌ తన మొదటి ఎంపికగా ఉందని ఫాతిమా తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్వ్యూను పూర్తిచేసిన తర్వాత రీచ్‌ ఆక్స్‌ఫర్డ్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసింది. తన ప్రాజెక్ట్‌ అనుభవాలు, ఒలింపియాడ్స్‌లో సాధించిన విజయాలు, రాజ్య పురస్కార్‌ వంటి అంశాలు ప్రొఫైల్‌ను మరింత బలపరిచాయని చెప్పింది. దీంతో ప్రతిష్ఠాత్మక రీచ్‌ ఆక్స్‌ఫర్డ్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికైంది.

కోటి రూపాయల విద్యా సహాయం

రీచ్‌ ఆక్స్‌ఫర్డ్‌ స్కాలర్‌షిప్‌ దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఫాతిమా తెలిపింది. ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా తన విద్య కోసం సుమారు కోటి రూపాయల వరకు సహాయం లభిస్తుందని చెప్పింది. అయితే తాను చదవాలనుకుంటున్న బీఎస్సీ మ్యాథమెటికల్‌ సైన్స్‌లో న్యూరోసైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌కు డర్హమ్‌ యూనివర్సిటీలో మంచి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపింది.

అందుకే డర్హమ్‌ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పూర్తి చేయాలనుకుంటున్నట్లు ఫాతిమా వెల్లడించింది. ఇందుకు యూకే ప్రభుత్వం అందించే ఎక్సలెన్స్‌ స్కాలర్‌షిప్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. భవిష్యత్తులో న్యూరోసైన్స్‌కు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అనుసంధానం చేస్తూ పరిశోధనలు చేయడంతో పాటు, ఈ రంగంలో మంచి రిసెర్చర్‌గా ఎదగాలన్నదే తన లక్ష్యమని అనీశ్‌ ఫాతిమా తెలిపింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana