
DNews: Mar 07: తెలంగాణలో వేసవి తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుండి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
భద్రాచలం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 38 డిగ్రీలు, రామగుండం, నిజామాబాద్, హైదరాబాద్, దుండిగల్, హకీంపేట్ ప్రాంతాల్లో 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి 7 నుండి మార్చి 9 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పసుపు హెచ్చరిక (Yellow Alert) ప్రకటించారు.
ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో కూడా గత రెండు రోజుల్లో 2 డిగ్రీల పెరుగుదల కనిపించింది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైతే, హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
