
D News: చియాన్ విక్రమ్ అంటేనే డిఫరెంట్ క్యారెక్టర్లు, ఊహించని గెటప్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు తన 63వ సినిమాతో మరోసారి అలాంటి కొత్త అవతార్‌లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘పవర్ హౌస్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ తాజాగా టైటిల్ ప్రోమో విడుదల చేశారు.
ప్రోమో ప్రారంభంలో విక్రమ్ చాలా సాధారణమైన వ్యక్తిగా కనిపిస్తారు. పెళ్లిళ్లకు క్యాటరింగ్ చేసే కుటుంబానికి చెందిన వ్యక్తిగా, ఇంట్లో వాళ్లతో సరదాగా గడుపుతూ కనిపిస్తారు. పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటూ.. తన క్యాటరింగ్‌కు ‘100 శాతం గ్యారంటీ’ అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పే సీన్లు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వైబ్‌ను ఇస్తాయి. ఊర్వశి, VTV గణేష్ సన్నివేశాలు కూడా కామెడీ టచ్‌ను తీసుకొచ్చాయి.
కానీ స్టోర్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత కథ ఒక్కసారిగా మరో మలుపు తిరుగుతుంది. అక్కడ తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు కనిపించగా.. వారి పక్కనే రక్తపు మరకలను ఎలాంటి టెన్షన్ లేకుండా శుభ్రం చేస్తున్న విక్రమ్‌ను చూపించారు. దీంతో అతని క్యారెక్టర్‌లో మరో ప్రమాదకరమైన కోణం ఉందనే విషయం ప్రోమో ద్వారా హింట్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ప్రత్యేకంగా విక్రమ్‌లో కనిపించిన ఈ ‘అన్నియన్’ షేడ్ అభిమానులకు ‘అపరిచితుడు’ రోజులను గుర్తు చేస్తోంది. అయితే ‘పవర్ హౌస్’ కథలో అతని క్యారెక్టర్‌కు, ‘అపరిచితుడు’కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. ప్రోమోలో మాత్రం కుటుంబం, కామెడీ, యాక్షన్, డార్క్ ఎలిమెంట్స్ కలగలిసిన కథను మేకర్స్ సూచించారు.
రియా శిబు, షమ్మీ తిలకన్, ఊర్వశి, ఎంఎస్ భాస్కర్, వీటీవీ గణేష్, సంయుక్త హెగ్డే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 2027లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
