
జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ భారత సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అద్భుత ప్రదర్శనతో రికార్డులు సృష్టిస్తున్నాడు. టీ20 క్రికెట్లో భారత్ తరఫున 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ తన సత్తా చాటుతున్నాడు.
ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో హర్యానా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్.. తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో అతడి టీ20 వికెట్ల సంఖ్య 400కు చేరింది. తద్వారా ఈ మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్గా అరుదైన ఘనత సాధించాడు.
భారత బౌలర్లలో చాహల్దే అగ్రస్థానం
టీ20 ఫార్మాట్లో భారత బౌలర్ల తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత భువనేశ్వర్ కుమార్ 386 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, జస్ప్రీత్ బుమ్రా 354 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో పియూష్ చావ్లా 329 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 323 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
జాతీయ జట్టులో చోటు దక్కకపోయినా చాహల్ తన ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తున్నాడు. టీ20 క్రికెట్లో 400 వికెట్ల మైలురాయిని చేరుకోవడం అతడి సుదీర్ఘ కెరీర్లో మరో కీలక ఘట్టంగా నిలిచింది.
