D Spiritual: Nov 21: కొండగట్టు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అరుదైన చందనోత్సవం శుక్రవారం వైభవంగా ముగిసింది. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కలగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు తరలివస్తున్నారు.

గత 60 సంవత్సరాలుగా స్వామివారి మూలవిరాట్టుపై ఉన్న చందనం కవచాన్ని తొలగించే ప్రక్రియను ఆలయ అర్చకులు, అధికారులు అత్యంత నియమనిష్ఠలతో పూర్తి చేశారు. ఈ నెల 15వ తేదీన ప్రత్యేక పూజలతో ప్రారంభమైన చందనం తొలగింపు కార్యక్రమం 18వ తేదీ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నిత్యం హోమాలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం బంగారం, వెండి, చెక్కతో తయారు చేసిన ప్రత్యేక పరికరాలతో స్వామివారిపై ఉన్న చందనాన్ని జాగ్రత్తగా తొలగించారు.

చందనం తొలగింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం పవిత్ర పంచనదుల జలాలు, సముద్రపు నీటితో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి మహాభిషేకం నిర్వహించారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పట్టువస్త్రాలతో అంజన్నను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం తొలుత అద్దంలో స్వామివారి దివ్యరూపాన్ని అర్చకులు దర్శించుకున్న అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ చారిత్రక చందనోత్సవానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

చివరిసారిగా 1965లో కొండగట్టులో చందనోత్సవం నిర్వహించగా, తిరిగి 60 ఏళ్ల తర్వాత భక్తులకు ఈ అరుదైన నిజరూప దర్శనం లభించింది. డిసెంబర్ 29వ తేదీ వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం అందుబాటులో ఉంటుందని ఆలయ అర్చకులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *