
D Spiritual: Nov 20: ఘనంగా శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ ఆలయ ఆరవ వార్షికోత్సవం.. మహా యజ్ఞ హోమం నిర్వహణ!
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ ఆలయ ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని గ్రామదేవత ముత్యాలమ్మ ఆలయంలో మహా యజ్ఞ హోమ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు చేపట్టారు.
అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ మహా యజ్ఞ హోమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, పూర్ణాహుతితో యజ్ఞ కార్యక్రమాన్ని సంపూర్ణం చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన గ్రామ పెద్దలు, సర్పంచ్ అమ్మవారికి చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ నెల 22వ తేదీన అమ్మవారికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు మదన్, కమిటీ నిర్వాహకులు, సభ్యులు, దంపతులు, మహిళలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
