D Spiritual: Nov 20: శ్రీరంగం రంగనాథస్వామికి టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ.. 2006 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం!

తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ తరఫున శుక్రవారం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర స్వయంగా ఆలయానికి చేరుకుని, సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా శ్రీరంగం ఆలయానికి చేరుకున్న టీటీడీ ఈవోకు ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ ప్రకాష్, ప్రధానార్చకులు శ్రీ సుందరభట్టర్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి తీసుకెళ్లారు. అక్కడ పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఈవో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

తమిళ కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని 2006 సంవత్సరం నుంచి టీటీడీ ప్రతి ఏటా శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తూ, రెండు ఆలయాల మధ్య ఉన్న సంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

అదేవిధంగా, తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం ఆలయం నుంచి కూడా ప్రతి ఏటా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా రెండు ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రాల మధ్య కొనసాగుతున్న ఈ సంప్రదాయం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజస్వామితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *