
D Spiritual: Nov 18: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ అధికారులు భక్తులకు శుభవార్త అందించారు. కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు, తీర్థయాత్రలు చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. కనీసం 30 మంది భక్తులు కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని వరంగల్-1 డిపో మేనేజర్ వెల్లడించారు.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం ఈ నెల 23న మధ్యాహ్నం హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. ఈ యాత్రలో భాగంగా మార్గమధ్యంలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఈ నెల 27న హనుమకొండకు చేరుకుంటుంది. ఈ యాత్రకు పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,500 టికెట్ ధరగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 88010 48382, 96521 24049 నంబర్లను సంప్రదించవచ్చు.
ఒకేరోజు పంచారామ క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల విశ్వాసాల మేరకు ప్రతి ఆదివారం హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ యాత్రలో భాగంగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం పంచారామ క్షేత్రాలను ఒకేరోజులో దర్శించుకునేలా యాత్రా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రయాణానికి పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,500 టికెట్ ధర నిర్ణయించారు. వివరాల కోసం 96521 24049 నంబరును సంప్రదించవచ్చు.
ఇక జిల్లాలోని అయ్యప్ప మాలధారుల కోసం శబరిమలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 36 మంది స్వాములు కలిసి బుక్ చేసుకుంటే ప్రత్యేక బస్సును కేటాయించనున్నారు. అంతేకాకుండా ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక వంటమనిషి, సామగ్రిని సర్దుకునే మరొకరికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కార్తీక మాసంలో భక్తులు సౌకర్యవంతంగా పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
