
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఆమె పాత్రకు సంబంధించి చిరంజీవి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
అనస్వర పాత్రపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు
‘కాకా’ సినిమాలో అనస్వర అద్భుతంగా నటించిందని చిరంజీవి ప్రశంసించారు. అనంతరం ఆమెను ఉద్దేశిస్తూ.. ‘‘అనస్వర.. నీ పాత్ర గురించి ఏమైనా మాట్లాడతావా?’’ అని సరదాగా అడిగారు. అయితే ఆమె మాట్లాడదని, మాట్లాడటం కూడా ఇష్టపడదని చిరు వ్యాఖ్యానించారు. ఈ మాటను ఇంటికి వెళ్లాక గుర్తుచేసుకుని ఆలోచిస్తే సినిమాలో ఆమె పాత్ర ఏమిటో అర్థమవుతుందని నవ్వుతూ చెప్పారు.
చిరంజీవి వ్యాఖ్యలతో అనస్వర కూడా సరదాగా స్పందించారు. దీంతో ఆమె సినిమాలో మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్రలో అనస్వర నటిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది.
వెంకీ కుడుములపై చిరంజీవి సరదా కామెంట్స్
ఇదే కార్యక్రమంలో దర్శకుడు వెంకీ కుడుముల గురించి కూడా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనలో మంచి కామెడీ టైమింగ్ ఉందని, అది తనకు బాగా నచ్చుతుందని చెప్పారు. సాధారణంగా తాను ఎవరినీ సినిమా చేయాలని అడగలేదని.. కానీ వెంకీ కుడుములను మాత్రం మంచి కథతో రావాలని కోరినట్లు వెల్లడించారు.
వెంకీ కూడా కథతో వస్తానని చెప్పి ఇప్పటివరకు రాలేదని, తనను ఎదురుచూసేలా చేసి ఇప్పుడు ‘ఇట్లు అర్జున’ సినిమాకు నిర్మాతగా మారిపోయాడని సరదాగా అన్నారు. అంతేకాకుండా.. కథ చెప్పడానికి వస్తావా? లేదంటే ఇంటి తలుపులు మూసేయనా? అని చిరంజీవి ప్రశ్నించారు.
దీనికి వెంకీ కుడుముల స్పందిస్తూ.. మీరు తలుపులు మూసేసినా సరే, దూకి వచ్చి కథ వినిపిస్తానని చమత్కరించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
సంక్రాంతికి ‘కాకా’ విడుదల
చిరంజీవి, బాబీ కలయికలో రూపొందుతున్న ‘కాకా’ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా అనస్వర పాత్రపై మెగాస్టార్ ఇచ్చిన హింట్‌తో ఈ సినిమాపై చర్చ మరింత జోరందుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
