
D Spiritual: Nov 17: భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అమ్మవారి కల్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
అనంతరం బీర్ల అయిలయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన అమ్మవారి కల్యాణ వేడుకలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
