
D Spiritual: Nov 17: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పాలమూరు జిల్లా కురుమూర్తి స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన ‘ఉద్దాల ఉత్సవం’ సోమవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాలు, గోవింద నామస్మరణలతో కురుమూర్తి గిరులు మారుమోగాయి. స్వామివారి పవిత్ర ఉద్దాల (పాదుకల) ఊరేగింపు కనులపండువగా సాగడంతో పాలమూరు పల్లెల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
ఉద్దాల ఉత్సవంలో భాగంగా ఉదయం 10 గంటలకు చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ప్రత్యేక నియమనిష్టలతో తయారు చేసిన పవిత్రమైన ‘చాట’ను పల్లమర్రి నుంచి భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. భక్తుల కోలాహలం మధ్య చాటను వడ్డేమాన్ గ్రామానికి తరలించారు.
వడ్డేమాన్ గ్రామానికి చేరుకున్న చాటకు గ్రామస్తులు, ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పవిత్ర ఉద్దాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ యాత్ర ఊకచెట్టు వాగుకు చేరుకోవడంతో అక్కడ మహా తిరునాళ్ల వాతావరణం నెలకొంది. భక్తుల గోవింద నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. అక్కడ భక్తులకు దర్శనం కల్పించిన అనంతరం చాటను నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో చేతులపై మోసుకుంటూ తిరుమలాపూర్ గ్రామానికి తీసుకెళ్లారు.
తిరుమలాపూర్లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉద్దాలకు, చాటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన చైతన్య రథం (ట్రాక్టర్)పై ఉద్దాలను కొలువుదీర్చి కురుమూర్తి క్షేత్రం వైపు ఊరేగింపుగా తరలించారు.
శివసత్తుల పూనకాలు.. ఉద్దాల గుండు వద్ద ఆధ్యాత్మిక సందడి
ఉద్దాల రథం కురుమూర్తి క్షేత్ర సమీపంలోని పవిత్రమైన ఉద్దాల గుండు వద్దకు చేరుకోగానే భక్తి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు, పూనకాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉద్దాల గుండు వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్దాలను మోకాళ్ల పర్వతం మీదుగా కొండపైకి భక్తిశ్రద్ధలతో తీసుకెళ్లారు.
సంప్రదాయం ప్రకారం ఆలయ ప్రాంగణంలో ముందుగా ఐదు ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్వయంగా ఉద్దాలను కురుమూర్తి స్వామివారి ఆలయంలోకి తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. దీంతో బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఉద్దాల ఉత్సవం విజయవంతంగా ముగిసింది.
ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆలయ కమిటీ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించింది. భక్తుల గోవింద నామస్మరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కురుమూర్తి క్షేత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.
