
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ అర్హత పోటీల్లో భారత షూటర్లు చరిత్రాత్మక ఆరంభం చేశారు. ఖతార్‌లోని దోహాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మూడు ఒలింపిక్ కోటా స్థానాలను సాధించింది. గత ఐదు ఒలింపిక్ అర్హత చక్రాల్లో తొలి టోర్నీలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
పిస్టల్, రైఫిల్, షాట్‌గన్ విభాగాల్లో భారత షూటర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జయపాల్ మాల్వియా రజత పతకం సాధించగా, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో నీరజ్ కుమార్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ విభాగంలో వివాన్ కపూర్ రజత పతకం సాధించి భారత్‌కు మూడో కోటా స్థానాన్ని అందించాడు.
2012 లండన్ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ తర్వాత తొలిసారిగా భారత్ ఒకే ప్రారంభ అర్హత టోర్నీలో మూడు కోటా స్థానాలను సాధించింది. గతంలో లండన్ 2012కు ముందు రెండు, రియో 2016కు ముందు ఒకటి, టోక్యో 2020, పారిస్ 2024కు ముందు రెండేసి కోటా స్థానాలను భారత్ దక్కించుకుంది.
ఈ విజయంపై నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కలికేష్ నారాయణ్ సింగ్ దేవ్ హర్షం వ్యక్తం చేశారు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత జట్టు సన్నద్ధతకు ఈ విజయం ఎంతో ఊతమిస్తుందని పేర్కొన్నారు. మూడు షూటింగ్ విభాగాల్లోనూ తొలి అవకాశంలోనే కోటాలు సాధించడం విశేషమని తెలిపారు.
ఎన్ఆర్ఏఐ ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్ సింగ్ కూడా భారత షూటర్ల ప్రదర్శనను ప్రశంసించారు. తీవ్ర పోటీ మధ్య జరిగిన ఫైనల్స్‌లో అథ్లెట్లు ప్రశాంతంగా రాణించారని అన్నారు. ఈ విజయానికి కోచ్‌లు, హై పెర్ఫార్మెన్స్ బృందం చేసిన కృషి కూడా కీలకమని అభినందించారు.
మూడు ఒలింపిక్ కోటా స్థానాలు సాధించడంతో పాటు దోహా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. భారత బృందం మొత్తం 13 పతకాలు సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.
ఈ చారిత్రాత్మక ప్రదర్శనతో లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ అర్హత పోటీల్లో భారత్ బలమైన పునాది వేసుకుంది. రాబోయే పోటీల్లో మరిన్ని కోటా స్థానాలు సాధించే అవకాశాలు భారత షూటర్ల ముందు ఉన్నాయి.
