
ముంబై: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ ముంబై పర్యటనలో సరదాగా గల్లీ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రిన్స్ విలియమ్ భార్య ప్రిన్సెస్ కేట్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ స్కూల్ విద్యార్థిని వేసిన బంతికి ప్రిన్స్ విలియమ్ క్లీన్ బౌల్డ్ కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మోరార్జీ రోడ్డులోని బల్లార్డ్ ఎస్టేట్‌లో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతపై పాఠశాల విద్యార్థినులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్స్ విలియమ్ కొద్దిసేపు క్రికెట్ ఆడి విద్యార్థినులతో సరదాగా గడిపారు.
ఈ సందర్భంగా బ్యాటింగ్‌కు దిగిన విలియమ్ కొన్ని మంచి షాట్లు ఆడారు. అయితే ఓ స్కూల్ విద్యార్థిని బౌలింగ్‌లో వేసిన బంతిని ఎదుర్కోలేక వికెట్ కోల్పోయారు. దీంతో అక్కడున్న వారంతా ఆనందంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
ఈ కార్యక్రమంలో ప్రిన్స్ విలియమ్ తెల్లటి షర్ట్‌పై నేవీ బ్లూ స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి కనిపించారు. ప్రిన్సెస్ కేట్ లేత ఆకుపచ్చ బ్లేజర్లో సందడి చేశారు. సచిన్ టెండూల్కర్ నేవీ బ్లూ షర్ట్, డార్క్ ట్రౌజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రాజకుటుంబానికి చెందిన ప్రముఖులు, క్రికెట్ దిగ్గజం ఒకే వేదికపై విద్యార్థినులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడటం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా స్కూల్ విద్యార్థిని బౌలింగ్‌లో ప్రిన్స్ విలియమ్ వికెట్ కోల్పోవడం ఈ పర్యటనలో ఆసక్తికరమైన ఘట్టంగా నిలిచింది.
