ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో ఫ్రాంచైజీలు తమ వద్ద కొనసాగించే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీని ఆటగాడిగా విడుదల చేసి కోచ్ లేదా మెంటార్ బాధ్యతలు అప్పగించాలని సీఎస్కేకు సూచించాడు. దీనివల్ల వేలం కోసం అదనంగా రూ.4 కోట్లు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డాడు.

ధోనీని నాన్ ప్లేయింగ్ రోల్‌లో కొనసాగించాలి!

2026 సీజన్‌లో గాయాల కారణంగా ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిని ఆటగాడిగా కొనసాగించడంపై సీఎస్కే పునరాలోచన చేయాలని అశ్విన్ సూచించాడు. ధోనీని విడుదల చేసి జట్టులోనే కోచ్ లేదా మెంటార్‌గా కొనసాగిస్తే ఫ్రాంచైజీకి ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నాడు.

రాహుల్ చాహర్, ప్రశాంత్ వీర్‌లను కూడా వేలంలోకి వదిలే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ప్రశాంత్ వీర్‌కు రూ.14.20 కోట్లు, కార్తిక్ శర్మకు రూ.14.20 కోట్ల చొప్పున భారీ ధర చెల్లించాల్సి వస్తోందని గుర్తుచేశాడు. మాథ్యూ షార్ట్, కార్తిక్ శర్మలను విడుదల చేస్తే సీఎస్కే వేలంలో సుమారు రూ.40-45 కోట్ల పర్స్‌తో అడుగుపెట్టవచ్చని విశ్లేషించాడు.

కార్తిక్ శర్మను తిరిగి కొనుగోలు చేయొచ్చు!

కార్తిక్ శర్మ నాలుగో స్థానంలో మంచి ప్రదర్శన చేశాడని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే అదే స్థానంలో శివమ్ దూబె, డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఆడగలరని గుర్తుచేశాడు. కార్తిక్ శర్మను కొనసాగించాలనే ఆలోచన ఉంటే ముందుగా విడుదల చేసి, వేలంలో తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలని సీఎస్కేకు సూచించాడు.

ఇతర జట్ల ఆటగాళ్లపైనా అశ్విన్ అంచనాలు

ముంబై ఇండియన్స్‌కు చెందిన దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు షారుఖ్ ఖాన్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మతీశ పతిరణ, కామెరూన్ గ్రీన్‌లను వదులుకునే అవకాశం ఉందని అంచనా వేశాడు.

ధోనీ కంటే బుమ్రానే తెలివైన క్రికెటర్!

మరోవైపు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో అత్యంత తెలివైన క్రికెటర్ ఎవరనే ప్రశ్నకు కూడా అశ్విన్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఈ విషయంలో ధోనీ కంటే జస్ప్రీత్ బుమ్రా మెరుగైనవాడని అభిప్రాయపడ్డాడు. బ్యాటర్ ఆలోచనా విధానాన్ని బుమ్రా చక్కగా అంచనా వేస్తాడని, ప్రత్యర్థి ఆటగాళ్ల బలహీనతలను గుర్తించి తన బౌలింగ్ ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తాడని ప్రశంసించాడు.

కాగా, నవంబర్ 17లోపు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను సమర్పించాలని బీసీసీఐ ఫ్రాంచైజీలకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఐపీఎల్ అభిమానుల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ధోనీ భవిష్యత్తుపై సీఎస్కే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *