D Spiritual: Nov 12: 60 ఏళ్ల తర్వాత కొండగట్టు అంజన్నకు చందనోత్సవం

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అరుదైన వేడుకకు సిద్ధమవుతోంది. దాదాపు 60 ఏళ్ల తర్వాత స్వామివారికి చందనోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు రోజులపాటు జరిగే ఈ ప్రత్యేక క్రతువుకు ఈ నెల 15న శ్రీకారం చుట్టనున్నారు. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు స్వామివారి మూలవిరాట్‌పై ఉన్న చందనాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు.

దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన కొండగట్టు ఆలయం గత 35 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందింది. గతంలో గర్భగుడిలోని స్వామివారి మూలవిరాట్‌కు ప్రతి శనివారం చందనంతో అలంకరణ చేసేవారు. దీంతో విగ్రహంపై చందనం పొర మందంగా పేరుకుపోయింది. 1965లో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని తొలగించారు. ఆ సమయంలో తొలిసారిగా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్న అర్చకులు, ఓ చిత్రకారుడితో స్వామివారి ఆకృతిని చిత్రింపజేశారు.

చందనం తొలగింపు ప్రక్రియ ఇలా..

స్వామివారి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించేందుకు పంచలోహాలతో తయారు చేయించిన రెండు సరాతాలకు బంగారు, వెండి తాపడం చేయించారు. వీటితోపాటు దేవతా వృక్షాలుగా భావించే మామిడి, జువ్వి, మర్రి, రావి, మేడి వృక్షాల కలపతో తయారు చేసిన ప్రత్యేక పనిముట్లను వినియోగించనున్నారు.

చందనం తొలగింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం కృష్ణా, గంగ, తుంగభద్ర, కావేరి, గోదావరి నదులతో పాటు సముద్రం నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఆలయ సంప్రోక్షణ చేపడతారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఈ నెల 21 నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.

ఐదు రోజులపాటు జరిగే ఈ మహత్తర క్రతువులో బెంగళూరు, విజయవాడకు చెందిన ఇద్దరు జియ్యంగార్లు పాల్గొననున్నారు. వీరితోపాటు 40 మంది రుత్వికులు, 20 మంది అర్చకులు, నలుగురు వేదపండితులు, 10 మంది పాచకులు, పరిచారులు పూజలు, హోమాది కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

బాలాలయంలో స్వామివారి దర్శనం

చందనం తొలగింపు ప్రక్రియ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు గర్భగుడి తలుపులను మూసివేయనున్నారు. ఈ సమయంలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు కలపతో తయారు చేసిన నాలుగు అడుగుల ఎత్తున్న స్వామివారి విగ్రహాన్ని గర్భగుడి ద్వారం ముందు ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 21 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు స్వామివారి పాదాలకు మాత్రమే చందనం పూయనున్నారు. డిసెంబర్ 29న తొలిసారిగా స్వామివారికి పూర్తి స్థాయిలో చందనంతో అలంకరణ చేయనున్నట్లు అర్చకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *