
D Spiritual: Nov 11: గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ.. భక్తుల ప్రత్యేక దర్శనాలు!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారు కార్తీక శుద్ధ విదియ పర్వదినాన్ని పురస్కరించుకుని గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఆలయంలోని ఉపాలయాల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేకంగా గాజుల అలంకరణ చేశారు.
అమ్మవారి మూలవిరాట్‌తో పాటు మహామండపంలోని ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల గాజులతో అందంగా అలంకరించారు. అలాగే ఉపాలయాల్లోని అమ్మవారి విగ్రహాలను కూడా గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక శుద్ధ విదియ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
