
D Spiritual: Nov 11: వేములవాడలో సామూహిక కార్తీక దీపోత్సవాలు ప్రారంభం
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక కార్తీక దీపోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీ బుధవారం నుంచి డిసెంబర్ 8వ తేదీ మంగళవారం వరకు నెల రోజుల పాటు సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుహాసినుల (ముత్తైదువుల) ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సామూహిక దీపోత్సవం నిర్వహించనున్నారు.
తొలిరోజు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినులకు ఆలయ అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు, వాయనం అందజేయడంతో పాటు శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీమతి జయకుమారి, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, రాధ, నూగురి నరేందర్తో పాటు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
