D Spiritual: Nov 10: బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా తొలి కార్తీక సోమవారం పూజలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తొలి కార్తీక సోమవారం పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు కూరెళ్ల సతీష్ శర్మ వేదమంత్రోచ్ఛరణల మధ్య రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

తొలి కార్తీక సోమవారం కావడంతో బెల్లంపల్లితో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో బుగ్గ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

బుగ్గ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల డీసీపీ

తొలి కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి దంపతులతో పాటు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి దంపతులు, మాజీ దేవస్థానం చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, కన్నాల మాజీ సర్పంచ్ జిల్లపల్లి స్వరూప వెంకటస్వామి సమక్షంలో అర్చకులు కూరెళ్ల సతీష్ శర్మ ఆలయ కోనేరు వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పూజల్లో పాల్గొన్న మహిళలు కోనేరులో అరటి దొప్పలలో దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. కోనేరు వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

అంతకుముందు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ గర్భగుడిలోని శివలింగానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనాలు పొందారు. ఆలయానికి విచ్చేసిన డీసీపీ భాస్కర్‌కు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో గర్రెపల్లి వేణుగోపాల గుప్తా, అర్చకులు కూరెళ్ల సతీష్ శర్మ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

తొలి కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *