
D Spiritual: Nov 9: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 9) తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది? శ్రీవారి సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దీపావళి పర్వదినమైన నవంబర్ 8న మొత్తం 78,228 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 25,564 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.01 కోట్ల ఆదాయం లభించింది.
మరోవైపు తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో కంప్లెక్స్ వెలుపల కూడా భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. క్యూలైన్లు కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకు విస్తరించాయి. ఈరోజు ఉదయం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 15 గంటల సమయం పడుతోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్ద ఉన్న గరుడాళ్వారు సన్నిధిలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్పూర మంగళహారతులు సమర్పించి, ప్రసాద నివేదనలు చేశారు. ఆ తర్వాత మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నిర్వహించడంతో దీపావళి ఆస్థాన కార్యక్రమం ముగిసింది.
తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు ప్రస్తుత రద్దీ పరిస్థితులను ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.
