D Educt: Nov 9: ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 2027-28 నుంచి కొత్త విధానం అమలు!

రాష్ట్రంలో 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాల్లో పలు మార్పులు తీసుకురావడానికి ఇంటర్‌ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరఖ్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులను అమలు చేయాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో పరీక్షలు, ప్రశ్నపత్రాల రూపకల్పన, విద్యార్థుల సామర్థ్యాల అంచనా విధానాల్లో ఏకరూపత తీసుకురావడమే పరఖ్‌ నిబంధనల ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధికారులకు ఎన్‌సీఈఆర్టీ ఇప్పటికే పరఖ్‌ నిబంధనలపై కార్యశాల నిర్వహించింది.

ఇకపై విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసి సమాధానాలు రాసే విధానానికి స్వస్తి పలకనున్నారు. కేవలం జ్ఞాపకశక్తిని కాకుండా విషయ పరిజ్ఞానం, అవగాహన, విశ్లేషణ, సమస్యల పరిష్కారం, సృజనాత్మక ఆలోచనా సామర్థ్యాలను పరీక్షించేలా ప్రశ్నపత్రాలను రూపొందించనున్నారు. పాఠ్యాంశాల్లోని సమాచారాన్ని నేరుగా అడగకుండా, విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించే ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పరీక్షించేలా 10 శాతం ప్రశ్నలను రూపొందించనున్నారు.

ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ప్రశ్నలు ఇస్తున్నారు. పబ్లిక్‌ పరీక్షల్లోనూ వీటిలో నుంచే ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే, ఈ ప్రశ్నలు విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పూర్తిస్థాయిలో పరీక్షించేలా ఉండటం లేదని విద్యా మండలి భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త విధానానికి అనుగుణంగా ప్రశ్నల రూపకల్పన కోసం సబ్జెక్టు నిపుణుల నుంచి ఇప్పటికే ప్రశ్నలను ఆహ్వానించింది. బోర్డు సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో ముద్రించే పాఠ్యపుస్తకాల్లో ఈ కొత్త ప్రశ్నలను చేర్చనున్నారు.

విద్యార్థుల అవగాహనకు ప్రాధాన్యం

విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని సమాధానాలను యథాతథంగా గుర్తుంచుకోవడానికే పరిమితం కాకుండా, ప్రతి అంశాన్నీ పూర్తిగా అర్థం చేసుకుని సొంతంగా ఆలోచించేలా ప్రశ్నపత్రాలను రూపొందించనున్నారు. విషయాలను విశ్లేషించి, తమకు తెలిసిన పరిజ్ఞానంతో సమాధానాలు రాసే సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. ఈ కొత్త బోధనా విధానానికి అనుగుణంగా అధ్యాపకులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని సాధించేందుకు ఇతరులతో కలిసి పనిచేయడం, బాధ్యతలను పంచుకోవడం, భిన్నమైన ఆలోచనలను గౌరవించడం, సమష్టిగా సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలనూ అంచనా వేస్తారు. అలాగే కొత్త ఆలోచనలు చేయడం, వినూత్న పరిష్కారాలను కనుగొనడం, ఒక సమస్యను విభిన్న కోణాల్లో పరిశీలించడం వంటి సామర్థ్యాలకు సృజనాత్మకత విభాగంలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలకు అనుగుణంగా ఎన్‌సీఈఆర్టీ పరిధిలో ఏర్పాటు చేసిన జాతీయ మూల్యాంకన కేంద్రం ‘పరఖ్‌’ ద్వారా దేశంలో పరీక్షల స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంటర్మీడియట్‌ పరీక్షల విధానంలో ఈ మార్పులను అమలు చేసేందుకు విద్యా మండలి చర్యలు చేపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *