D Spiritual: Nov 9: వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా దీపావళి వేడుకలు.. కనులపండువగా అంబారి వాహన సేవ!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దీపావళి పర్వదిన వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. నరక చతుర్దశిని పురస్కరించుకుని తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ప్రధాన ఆలయంలో దీపావళి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత సుప్రభాత సేవ, మంగళహారతి, అభ్యంగన స్నానం నిర్వహించారు. అనంతరం ఉదయం 4.45 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, 5 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు శ్రీ భీమేశ్వరాలయంలో నరకాసుర వధకు సంబంధించిన పురాణ ప్రవచనాన్ని వినిపించారు. అలాగే ప్రధాన ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి ఉత్సవమూర్తుల సన్నిధిలో ధనలక్ష్మి మహాపూజను ఏకాంతంగా ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

కనులపండువగా అంబారి వాహన పెద్దసేవ ఊరేగింపు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్లను అంబారి వాహనంపై అధిష్ఠింపజేసి వైభవంగా ఊరేగించారు. పెద్దసేవ ప్రారంభానికి ముందు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హరిహరమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజన్న ఆలయం నుంచి అంబారి వాహన పెద్దసేవ భక్తుల జయజయధ్వానాల మధ్య ప్రారంభమైంది.

ఈ ఊరేగింపు మయూరి బుక్ స్టాల్, మండప హనుమాన్ దేవాలయం మీదుగా గడీ (పాత కూరగాయల మార్కెట్) వద్దకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తల్లం రామ్ మోహన్ వీధి గుండా మధు రాధాకిషన్ ఇంటి సమీపం నుంచి బద్ది పోచమ్మ దేవాలయం వరకు కొనసాగింది. అక్కడి నుంచి శ్రీ భీమేశ్వరాలయం ముందు ప్రత్యేక హారతి సమర్పించిన అనంతరం అంబేడ్కర్ విగ్రహం మీదుగా పాత కూరగాయల మార్కెట్, మండప హనుమాన్ ఆలయం ముందు నుంచి తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంది.

ఈ వైభవోత్సవంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు కొక్కుల బాలకృష్ణ, కొండ శేఖర్, తోట రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అంబారి వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *