పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి, ఆమె తలతో ఇంటి ఆవరణలోని ఆలయంలో కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


ఆలయంలో భార్య తలతో కనిపించిన భర్త

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా గంగారాంపూర్ పట్టణంలోని మున్సిపల్ వార్డు నంబర్ 4లో ఈ ఘటన జరిగింది. 46 ఏళ్ల రింటు సర్కార్ తన భార్య సీమా సర్కార్ (42)ను తెల్లవారుజామున హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆ తర్వాత భార్య తలను తీసుకుని ఇంటి ప్రాంగణంలోని ఆలయానికి వెళ్లి అక్కడ కూర్చున్నట్లు సమాచారం. ఆలయం వద్దకు వచ్చిన ఓ స్థానికుడు ఈ దృశ్యాన్ని చూసి భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు భార్య తలను ఒక చేతిలో, పదునైన ఆయుధాన్ని మరో చేతిలో పట్టుకుని ఆలయం నుంచి బయటకు రావడంతో స్థానికులు భయంతో వెనక్కి వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు

స్థానికులు ఇచ్చిన సమాచారంతో గంగారాంపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల ఆలయం వద్ద లభించగా, మొండెం వారి నివాసంలో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఫోరెన్సిక్ ఆధారాలను కూడా సేకరిస్తున్నట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. నిందితుడిని విచారించి హత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఉద్యోగం కోల్పోయిన తర్వాత మారిన ప్రవర్తన?

రింటు సర్కార్ గతంలో ప్రభుత్వ రంగానికి చెందిన నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో బస్ కండక్టర్‌గా పనిచేసేవాడని సమాచారం. క్రమశిక్షణా కారణాలతో మూడేళ్ల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించినట్లు అతడు పోలీసులకు తెలిపినట్లు హిందుస్తాన్ టైమ్స్ కథనం పేర్కొంది.

పోలీసులు అతడిని తీసుకెళ్తున్న సమయంలో తన ఉద్యోగం పోయిన తర్వాత మానసికంగా మారిపోయానని వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే అతడి మానసిక స్థితిపై అధికారిక వైద్య నిర్ధారణ వెలువడలేదు.

భార్యాభర్తల మధ్య గొడవలే కారణమా?

ఈ దంపతులకు ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తెల్లవారుజామున జరిగిన గొడవ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. నిందితుడి గత ప్రవర్తన, కుటుంబ పరిస్థితులు, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటనతో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *