Doodimetla Balaraj Yadav Gets Bail: Another Setback for Congress Government as BRS Leader Secures Court Relief

Doodimetla Balaraj Yadav | బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయనకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. సిట్ పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచిన కొద్దిసేపటికే బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావుకు మద్దతుగా బాలరాజ్ యాదవ్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో బల్మూరి వెంకట్ భార్య ఇందుజారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన భర్తపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులో బాలరాజ్ యాదవ్ పేరు లేదని, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఆయన పేరును చేర్చలేదని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

అయినప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హైదరాబాద్ సిట్ పోలీసులు నాగోల్‌లోని బాలరాజ్ యాదవ్ నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిపారు.

తర్వాత బాలరాజ్ యాదవ్‌ను బషీర్‌బాగ్‌లోని సిట్ కార్యాలయానికి తరలించి విచారించారు. రాత్రి 10 గంటల సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. అనంతరం రాత్రి 11 గంటల తర్వాత న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లే.. న్యాయవాది లక్ష్మణ్

బాలరాజ్ యాదవ్‌పై నమోదు చేసిన కేసులోని సెక్షన్లపై ప్రముఖ న్యాయవాది లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనపై 356(2), 352, 79 బీఎన్‌ఎస్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని 3(1)(ఆర్) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని వివరించారు.

ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు సంబంధించి నిందితుడిని రిమాండ్‌కు తరలించే ముందు చట్టప్రకారం నోటీసు జారీ చేయాల్సి ఉంటుందని, బీఎన్‌ఎస్‌ఎస్‌ 35(3) ప్రకారం ముందుగా నోటీసు ఇవ్వడం తప్పనిసరి అని లక్ష్మణ్ పేర్కొన్నారు. అరెస్టు సమయంలో ఈ నిబంధనలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదని ఆరోపించారు.

తాజాగా బాలరాజ్ యాదవ్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *