Munaganoor Land Scam: Rs. 200 Crore Government Land Targeted, Survey Numbers Allegedly Manipulated for Illegal कब्जession

రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు భారీ కుట్ర జరుగుతున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మునగనూరులో సర్వే నంబర్లను మార్చి సుమారు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి మార్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ భూమిలో విల్లాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ అనుమతుల కోసం దరఖాస్తులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రంగారెడ్డి, నవంబర్ 6: హైదరాబాద్‌ శివారులోని మునగనూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు కీలక వ్యక్తుల అండదండలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమికి సబ్‌డివిజన్‌ పేరుతో రెవెన్యూ అధికారులు కొందరు వ్యక్తులకు నాలా చెల్లింపులు జరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ చెల్లింపులను ఆధారంగా చేసుకుని సదరు వ్యక్తులు భూమిలో భారీ అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ భూముల వ్యవహారం గతంలోనూ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆక్రమణ ఆరోపణలు రావడంతో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో పాటు సీపీఎం, సీపీఐ నాయకులు అక్కడి భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూములను వెంటనే నిషేధిత జాబితాలో చేర్చి పరిరక్షించాలని ఉన్నతాధికారులను కోరినా స్పందన లేదని ఆరోపణలు ఉన్నాయి.

సబ్‌డివిజన్‌ పేరుతో భూమి మార్పిడి?

మునగనూరు గ్రామంలోని సర్వే నంబర్‌ 44లో సుమారు 40.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు సమాచారం. ఈ భూమిని ఆక్రమించేందుకు సర్వే నంబర్లలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సర్వే నంబర్‌ 44ను 44/1, 44/2, 44/3, 44/4, 44/10, 44/11గా విభజించారు.

వీటిలో 44/1 నుంచి 44/4 వరకు ఉన్న సబ్‌డివిజన్లతో పాటు అసలు 44 సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. అయితే 44/10, 44/11 పరిధిలోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రం కొందరు వ్యక్తుల పేర్లపై పట్టా భూమిగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ భూమికి నాలా చెల్లింపులు కూడా జరిగినట్లు సమాచారం.

ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని సదరు వ్యక్తులు విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని, దానిని కాపాడాలని స్థానికులు, రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం 40.10 ఎకరాల్లో 12 ఎకరాలను పట్టా భూమిగా మార్చినట్లు ఆరోపణలు వస్తుండగా, ఈ భూమి ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

కబ్జా వెనుక కీలక వ్యక్తులు?

మునగనూరు భూముల వ్యవహారం వెనుక పలువురు బడా వ్యక్తులు, కీలక నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఎంపీతో పాటు కొందరు బిగ్‌ బ్రదర్స్‌ ఆక్రమణదారులకు అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. విలువైన ప్రభుత్వ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని స్థానికంగా చర్చ సాగుతోంది.

పెద్దల ఒత్తిళ్ల కారణంగానే అధికారులు ఈ భూముల వ్యవహారంపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

కోహెడ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి

హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములపై నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అనుమతులు ఇస్తున్న తీరుపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని కోహెడలో విల్లాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం అప్పట్లో వివాదానికి దారితీసింది.

విల్లాలు నిర్మిస్తున్న స్థలం ప్రభుత్వ భూమి అని, నాలాలను తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ అనుమతులను రద్దు చేయాలని అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ గత ఏడాది హెచ్‌ఎండీఏకు లేఖ రాశారు. అయినప్పటికీ ఇప్పటివరకు అనుమతుల రద్దుపై స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది.

ఇప్పుడు మునగనూరులోని సర్వే నంబర్‌ 44 పరిధిలో ఉన్న 12 ఎకరాల భూమికి కూడా నిర్మాణ అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమిపై ఎలాంటి పరిశీలన లేకుండా అనుమతులు మంజూరు చేస్తే ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *