
తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయనున్నారు.
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మహిళలకు ఉచితంగా చీరలు అందించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్ 19 నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది మహిళలకు ఈ చీరలను అందించనున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.334 కోట్లు కేటాయించింది.
చీరల రంగుల్లో మార్పులు
ఈసారి ఇందిరమ్మ చీరల డిజైన్, రంగుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేయగా.. ఇప్పుడు చిక్కని పచ్చ రంగుతో పాటు ఎరుపు రంగు జరీ అంచు ఉన్న చీరలను అందించనున్నారు.
ఈ చీరల తయారీ ప్రక్రియ ఏప్రిల్ నెలలో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 163 కేంద్రాల్లో చీరలను తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 65 లక్షల చీరల ఉత్పత్తి పూర్తయింది. తయారైన చీరలను ఇప్పటికే వివిధ జిల్లాలకు తరలించారు. మిగిలిన చీరల తయారీ కూడా కొనసాగుతోంది.
ఆధార్ కార్డు తప్పనిసరి
ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని మహిళలు తమ ఆధార్ కార్డుతో సంబంధిత పంపిణీ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అధికారులు ఆధార్ వివరాలను పరిశీలించి అర్హతను నిర్ధారించిన అనంతరం చీరలను అందజేస్తారు.
పంపిణీలో పారదర్శకతను పాటించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చీరలు అందుకున్న మహిళల వివరాలను పంచాయతీ అధికారులు ఈ యాప్లో నమోదు చేయనున్నారు. తద్వారా ఒకే మహిళకు రెండుసార్లు చీరలు పంపిణీ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు సంబంధిత అధికారులకు అప్పగించారు. అర్హులైన మహిళలందరికీ వారం రోజుల్లోగా చీరలు అందేలా పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
