
ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి ఇంద్రజ. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. టాలీవుడ్‌లోని పలువురు అగ్ర హీరోల సరసన నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం వివాహం చేసుకుని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే, ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరించిన ఇంద్రజ.. కమెడియన్లు, టీమ్ సభ్యులతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జబర్దస్త్ షో, సుడిగాలి సుధీర్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. జబర్దస్త్ నుంచి సుధీర్, చంద్ర, అభి వంటి కమెడియన్లు వెళ్లిపోయిన తర్వాత షో రేటింగ్స్ తగ్గాయా అనే అంశంపై స్పందించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడనని స్పష్టం చేశారు. “నా గురించి ఏదైనా అడిగితే తప్పకుండా చెబుతాను. కానీ ఇతరుల వ్యక్తిగత, వృత్తిపరమైన నిర్ణయాల గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. వాళ్ల జీవితాలకు సంబంధించిన విషయాల్లో నేను జోక్యం చేసుకోను” అని తెలిపారు.
తనపై నమ్మకంతో చాలామంది వ్యక్తిగత విషయాలను పంచుకుంటారని, వారు చెప్పిన విషయాలను తాను ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతానని ఇంద్రజ వివరించారు. అయితే, సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయాన్ని ప్రస్తావించగానే ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో సుధీర్ లేకపోవడంతో రామ్ ప్రసాద్ ఒంటరిగా మిగిలిపోయాడనే కాన్సెప్ట్‌తో కెవ్వు కార్తీక్ చేసిన స్కిట్ తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు. ఆ స్కిట్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని, సాధారణంగా అందరి ముందు అంతగా భావోద్వేగానికి గురికాని తాను ఆరోజు మాత్రం తనను తాను నియంత్రించుకోలేకపోయానని గుర్తుచేసుకున్నారు.
సుధీర్‌ను సిద్ధు అని పిలుస్తా.. మా మధ్య బంధం ప్రత్యేకం!
సుడిగాలి సుధీర్‌ను తాను ముద్దుగా ‘సిద్ధు’ అని పిలుస్తానని ఇంద్రజ వెల్లడించారు. సుధీర్ అక్క ఒకసారి జబర్దస్త్ ఎపిసోడ్‌కు వచ్చినప్పుడు ఇంట్లో అతడిని సిద్ధు అని పిలుస్తారని చెప్పడంతో ఆ పేరు తనకూ అలవాటైందని తెలిపారు. అలాగే సుధీర్ కూడా తనను ఇంట్లో పిలుచుకునే పేరు ‘రాజీ’ అని పిలుస్తుంటాడని చెప్పారు.
తమ మధ్య ఉన్న అనుబంధం కేవలం కెమెరాల ముందు కనిపించే నటన కాదని, నిజమైన ఆప్యాయతతో ఏర్పడిన బంధమని పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య ఏడెనిమిదేళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ, ప్రేక్షకులు తమను తల్లీకొడుకుల్లా చూస్తుంటారని, అది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ఎవరైనా తనను అమ్మా అని పిలిస్తే చాలా ఆనందంగా ఉంటుందని ఇంద్రజ పేర్కొన్నారు.
ప్రవీణ్ నాకు దేవుడిచ్చిన కొడుకు!
సుధీర్‌తోనే కాకుండా జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్‌తో కూడా తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఇంద్రజ వెల్లడించారు. ప్రవీణ్‌ను దేవుడిచ్చిన కొడుకుగా, తనను దేవుడిచ్చిన అమ్మగా అభివర్ణించారు. తనకు అమ్మ లేదనే లోటును ప్రవీణ్ ఎక్కువగా అనుభవిస్తుంటాడని తెలిసి బాధపడినట్లు చెప్పారు.
ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చని ప్రవీణ్‌కు చెప్పానని గుర్తుచేసుకున్నారు. మదర్స్ డే సందర్భంగా ప్రవీణ్‌తో కలిసి చేసిన స్కిట్ తనకు ప్రత్యేకమైన జ్ఞాపకమని తెలిపారు. అంతేకాకుండా ప్రవీణ్‌కు వాచ్‌తో పాటు కారు సౌండ్ సిస్టమ్ కొనుక్కోవడానికి డబ్బులు కూడా బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు.
సుధీర్ పెళ్లి గురించి ఇంద్రజ ఏమన్నారంటే?
ఇక చివరిగా సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఇంద్రజ ఆసక్తికరంగా స్పందించారు. అది పూర్తిగా సుధీర్ వ్యక్తిగత విషయమని, అతడి నిర్ణయాల్లో తాను జోక్యం చేసుకోనని చెప్పారు.
“రేపు నా కూతురి పెళ్లి విషయంలో కూడా నేను ఇదే చెబుతాను. నీ పెళ్లికి నాకు చెప్పి పిలవమ్మా అని అంటాను. వాళ్లే వచ్చి అమ్మా, నువ్వే చూసి పెట్టు అని అడిగితే తప్ప మనం వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోకూడదు” అంటూ సరదాగా సమాధానమిచ్చారు.
మొత్తానికి సుధీర్, ప్రవీణ్‌లతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. జబర్దస్త్ వేదికపై ఏర్పడిన ఈ తల్లీకొడుకుల బంధాల గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
