
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పాఠశాల తరగతి గదిలోకి చొరబడిన నిందితుడు బాలికను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగా, మరో విద్యార్థిని కూడా గాయపడింది. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే అతడి కుడి కాలును తొలగించారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా వివరాలు తెలుసుకుందాం.
క్లాస్‌రూమ్‌లోకి ఎలక్ట్రిక్ రంపంతో ప్రవేశం
నవంబర్ 1న ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో రాప్తాడులోని ఓ పాఠశాలలో తరగతులు జరుగుతున్నాయి. పాఠశాల ప్రాంగణంలో నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ప్రధాన గేటు తెరిచి ఉంది. ఇదే అవకాశంగా భావించిన నిందితుడు హేమంత్.. బయటే ఎలక్ట్రిక్ రంపాన్ని ఆన్ చేసి నేరుగా పదో తరగతి క్లాస్‌రూమ్‌లోకి ప్రవేశించాడు.
అనంతరం అక్కడ ఉన్న ఓ విద్యార్థినిపై రంపంతో దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో తరగతి గదిలో భయానక వాతావరణం నెలకొంది. ప్రాణభయంతో విద్యార్థులంతా అరుస్తూ బయటకు పరుగులు తీశారు.
ఘటన సమయంలో క్లాస్‌రూమ్‌లో ఉన్న గణిత ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. బయట మోటార్ శబ్దం వినిపించడంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని భావించామని, అయితే నిందితుడు ఎలక్ట్రిక్ రంపంతో ఒక్కసారిగా లోపలికి వచ్చి దాడి చేశాడని వివరించారు. అనంతరం రంపాన్ని అక్కడే వదిలేసి నిందితుడు పరారయ్యాడు.
బెంగళూరులో బాధిత బాలికకు చికిత్స
దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను తొలుత ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
మరోవైపు, రెండో విద్యార్థిని కూడా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రంపం కాలుకు తగలడంతో ఎక్స్టెన్సర్ టెండన్స్ తెగిపోయి లోతైన గాయం ఏర్పడిందని వైద్యులు తెలిపారు. బొటనవేలు పక్కకు జరిగిపోవడంతో దానికి అవసరమైన చికిత్స అందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.
నిందితుడిపై పోలీసుల కాల్పులు
ఈ దాడికి పాల్పడింది హేమంత్‌గా పోలీసులు గుర్తించారు. బాధిత బాలికకు అతడు బంధువని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
నవంబర్ 1న ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంత్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు తొలుత గాలిలో కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గకుండా ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను గాయపరిచాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి కుడి కాలు తొలగింపు
పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల వివరాల ప్రకారం, అతడి శరీరానికి మొత్తం ఆరు బుల్లెట్ గాయాలయ్యాయి. చికిత్స సమయంలో అతడి కుడి కాలు తొడ కింది భాగం నల్లగా మారి కుళ్లిపోవడంతో వైద్యులు దానిని తొలగించారు. పరిస్థితిని బట్టి ఎడమ కాలును కూడా తొలగించాల్సి వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
విద్యార్థులకు కౌన్సెలింగ్.. రంగంలోకి 20 మంది నిపుణులు
రాప్తాడు ఘటనపై రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెంగళూరులో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు.
ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. దీంతో వారికి భయాన్ని తొలగించి ధైర్యం కల్పించేందుకు మానసిక వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన 20 మంది మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను రాప్తాడులోనే నియమించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ అందిస్తూ ఘటన ప్రభావం నుంచి బయటపడేలా చర్యలు చేపట్టారు.
