
అనంతపురం జిల్లా రాప్తాడులో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సినిమాల్లో చూపించే హింసాత్మక సన్నివేశాలే కారణమంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సినిమాల ప్రభావంతోనే యువత నేరాలకు పాల్పడుతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ విమర్శలపై టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఘాటుగా స్పందించారు. విషాదకరమైన ఘటనను కూడా కొందరు తమ వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు.
ఇటీవల రాప్తాడులోని ఓ పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై నిందితుడు రంపంతో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో గాయపడిన బాధితురాలు ప్రస్తుతం బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనను సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.
అయితే ఈ ఘటన నేపథ్యంలో సినిమాల్లోని హింసాత్మక సన్నివేశాలపై మరోసారి చర్చ మొదలైంది. తెరపై చూపించే హింస యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విమర్శలపై దర్శకుడు వేణు ఊడుగుల ఇప్పటికే స్పందించగా, తాజాగా సందీప్ రెడ్డి వంగా కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో సందీప్ రెడ్డి వంగా విమర్శకుల తీరును తప్పుబట్టారు. సమాజంలో ఇలాంటి భయానక ఘటనలు జరిగినప్పుడు ముందుగా బాధితుల పట్ల సానుభూతి చూపించాలని, అసలు సమస్యకు కారణాలను లోతుగా పరిశీలించాలని పేర్కొన్నారు. అంతేకానీ, ప్రతిసారీ సినిమాలను నిందించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
బాధిత కుటుంబాల బాధను పట్టించుకోకుండా, ఈ ఘటనను కొందరు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా కొందరు విఫలమైన నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలాంటి సందర్భాల కోసం ఎదురుచూస్తుంటారని, ఘటన జరిగిన వెంటనే సామాజిక బాధ్యత ఉన్నవారిలా మాట్లాడుతూ ఇతరులపై విమర్శలు గుప్పిస్తుంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
చివరగా, ఒక విషాదకరమైన ఘటన బాధితులకు సానుభూతి, సమాజం నుంచి మద్దతు అందించాల్సిన సందర్భమని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులను అవకాశవాద విమర్శలకు వేదికగా మార్చుకోవడం తగదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలతో రాప్తాడు ఘటనకు సినిమాలే కారణమంటూ జరుగుతున్న చర్చకు ఆయన మరోసారి తెరపైకి తెచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
